1.
తెలుగుతనం ఉట్టిపడే బుట్ట బొమ్మలా
బాపూబొమ్మ ఉలికిపడే ముద్దుగుమ్మలా
అమరావతి శిల్పంలా అన్నమయ్య కల్పనలా
క్రిష్ణవేణి తరగలా గోదావరి నురగలా
పల్లవి: ఎవరో ఎవరో నను పిలిచారూ
ఎదలో సుధలే కురిపించారూ
ఎవరో ఎవరో నను తలచారూ
మదిలో గుబులే కలిగించారూ ”ఎవరో”
చరణం 1: నుదుటిన మెరిసే కుంకుమ తిలకంలా
కనులకు దిద్దిన నల్లని కాటుకలా
అరచేతిన పండిన ఎర్రని గోరింటలా
పాదాలకు రాసిన పచ్చని పారాణిలా
కూచిపూడి భంగిమలా
క్షేత్రయ్య భావనలా
కొండపల్లి బొమ్మలా
కోనసీమ కొబ్బరి రెమ్మలా
ముంగిట ముచ్చటగా తీర్చిన
రంగవల్లికలా ” ఎవరో”
చరణం2: పెరటిలో వెలసిన తులసీ కోటలా
ఇంటిముందు విరిసిన గులాబీ తోటలా
తలలూపుతు పలకరించు పచ్చని పైరులా
గలగల పారుతున్న తెల్లని సెలయేరులా
దీపావళి వెలుగులా
సంక్రాంతి సందడిలా
రామదాసు కీర్తనలా
ఘంటసాల మధుర గాత్రములా
అందరినీ అలరించే స్వాతి
సపరివార పత్రికలా ”ఎవరో”
2.
పదహారణాల తెలుగమ్మాయి....
కలువల్లాంటి కళ్ళు,
దొండపండులాంటి పెదవులు,
చేమంతుల్లాంటి చెక్కిలూ,
తుమ్మెద రెక్కల హోయల్లాంటి కురులు,
కళ్ళలో మెరిసే వెలుగు ఇంకా చురుకుదనం,
కొంచం సరదాగా,
మరికొంచెం సాంప్రదాయంగా,
కొంచం లక్షణంగా,
చాల గడుసుగా,
చిలిపిగా.
అందంగా, ఆనందం మోమంత విరబూసి,
చెంగు చెంగున తుళ్ళుతూ , లంగావోని వేసుకుని వచ్చే ,
తెలుగింటి అమ్మాయిని చూసి చందమామ కూడా మొహం తిప్పుకోక పోతుందా......?
చెప్పండి మీరే............ ......... .......!
లక్షణంగా నుదుటిన బొట్టు…
కళ్ళకు కాటుక….
వాలు జడ…
గల గల గాజులు….
పదహారణాల చీర కట్టూ….
కాళ్ళకు పట్టాలు….
గోరింటాకు, పూలు..
పెద్ద పెద్ద కళ్లు…
ఆ కళ్ళలో కూసింత పొగరు…
అన్ని కలగలిపి ఉండే
16 అణాల తెలుగు అమ్మాయిని ఇష్టపడని
వారు ఉండరేమో
3.
తీరైన తన నడకతొ లయబద్ధంగా సవ్వడి చేస్తున్న పట్టీలు
నా చూపుని తన వైపు మరల్చాయి...
సింధూరం, పసుపు పచ్చల పట్టు పరికిణీని మునివేళ్ళతో
కొంచెం పైకి లాగి తను కలియతిరుగుతుంది వాకిట దేని కోసమో వెతుకుతూ...
ఏదో కనుగున్నట్టు ఇంట్లోకి పరుగెట్టింది...
నేను తనకోసం ఎదురుచూడకుండా ఉండలేకపోయాను...
ముగ్గు గిన్నెతో తను బయటకొచ్చింది
పైటను నడుముకు చుట్టుకుని, పరికిణీ సర్దుకుని
ఒంటి కాలిపై భారం మోపి, కూర్చుంది ముగ్గుపెట్టటానికి...
నేను అలానే చూస్తున్నాను...
తన వేళ్ళు ఏదో మాయం చేస్తున్నట్టు
చక చకా చుక్కలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి
ఆ వేగంతో చుక్కలని అనుసరించడానికి ప్రయత్నించిన నా కళ్ళు తిరిగాయి...
ఒకసారి పైకి చూసాను
నింగిలో చుక్కలు నేలపై ఆమె వేలు జారిన చుక్క చుక్కలో
పోలికలు వెతుక్కుంటు మురిసిపోతున్నాయి ఎంచక్కా...
అదే పనిగా... చంద్రుడు లేడని గుసగుసలాడుతున్నాయి
అది విని నెలరాజు మోము చిన్నబోయింది,
రోజు తనతో ఊసులాడే చిన్నది తనని ఈరోజు మరచిపోయిందని...
నేను తేరుకుని తనవైపు చూసాను
ముంగురులను పైకి పోగు చేసుకుంటూ తను పైకి లేచింది
ఒక్కసారి తనివితీర కిందకిచూసింది
తన చూపుల్ని నా చూపులు అనుసరించాయి
ఆహా... ఎంతటి అందమైన ముగ్గు...!
చంద్రుడు చిన్నబోవటంలో అర్ధం వుందనిపించింది...
ముగ్గుని చూసుకున్న ఆనందంతో తన కళ్ళు మెరిసాయి
పెదవులపై నవ్వులు విరిసాయి
ఆ నవ్వులో తడిసిన ముగ్గు ముత్యాల ముగ్గయ్యింది
ఆ ముంగిట వెలుగులు నింపింది...
4.
తెలుగమ్మాయి తెలుగమ్మాయి తెలుగమ్మాయి
లంగా ఓని కట్టుకొచ్చిన తెలుగమ్మాయి
పల్లె సీమలో పచ్చని పైరు తెలుగమ్మాయి
తెలుగు ముంగిలిలో రంగుల ముగ్గు
కూచి పూడి లో కులుకుల సిగ్గు
తెలుగమ్మాయి ఈ తెలుగమ్మాయి
తోలి పొద్దుల వెలుగమ్మాయి
తోలి చినుకుల చిగురమ్మయి
చిరు ఆశల కల అమ్మయి
కలలన్ని నిజమమ్మాయి
తెలుగమ్మాయి ఈ తెలుగమ్మాయి
పాటల పూదోట - http://nsrinivasa2011.blog.com/2011/01/31/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF/
'మనసా తుళ్ళిపడకే అతి గా ఆశ పడకే' బ్లాగ్ - http://manasulomatacheppna.blogspot.com/2011/03/blog-post_6241.html
Telugu Bloggers - http://www.telugubloggers.com/2008/01/18/%E0%B0%AE%E0%B1%81%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B2-%E0%B0%AE%E0%B1%81%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B1%81-2/
కవితలు గురు - http://kavithaluguru.blogspot.com/2010/01/blog-post_3014.html
Hyderabad News - http://www.vasantam.net/



